Mouna Vilaapam
Telugu padyaalu by G.V.S. Avadhani.
Saturday, 3 September 2011
ధన మహిమ
ధనమా ఎవ్వర వీవు? రాతి బోమవా? దైవాంశ సంభూతవా?
అనుజుల్ కొట్టుకు చత్తురే ధనముకై అమ్మా జగత్ వ్యాపినీ
ధనమున్ జూపగ లేచి వచ్చును గదా ధాత్రిన్ శవంబేని! యీ
ధనమా హాత్మ్యము శక్యమే తెలుపగన్ తల్లీ నమోవాకముల్
-- గ.వెం.సు
సామాన్యుని ఆవేదన
స్వార్థ చింతన లేక సంక్షేమమును కోరు
త్యాగ ధనులను కన్న ధాత్రి మనది
రాజ్య కాంక్షయు లేని రఘు కులోత్తముడు శ్రీ
రామచంద్రుని కన్న రత్న గర్భ
సుఖ భోగముల రోసి అఖిలంబు విడచిన
సిద్ధార్థు కన్నట్టి సింధు నేమి
పరదేశ వాసుల భరతంబు పట్టిన
జాతి పితను కన్న జన్మ భూమి
తే.గీ
కవిని సమ్రాట్టు చేసిన కల్పవల్లి
కళల కాణాచి ఈ తల్లి కర్మ భూమి
ధన్యుడైతిని తల్లి ఈ ధరణి పుట్టి
భారమనుకోకు నను మోయ భరత మాత
-- గ.వెం.సు
మనోస్పందన
కనులు గ్రుడ్డివైన కన్నీరు తప్పునా
ముద్దు మురిప ముండు మూగియైన
కుంటియైన నేమి కోపంబు నుండదా
భావ ముండి తీరు బధిరుడైన
Friday, 2 September 2011
వినాయక స్తుతి
గరిక పూజ తోడ గణుతికెక్కిన దేవ
కవిత వ్రాయు చుంటి గణపతయ్య
గరికి పాటి కవిత ఘనమైన కవితగా
వాసి కెక్కు నటుల వరము నిమ్ము
--- గ.వెం.సు
Home
Subscribe to:
Posts (Atom)